#41ఉదయా రాధన — ప్రాతఃకాల కీర్తన
Author: మిక్కిలి సమూయేలుComposer/Ragam: బిలహరిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
మేలుకొనరే మీ మనంబుల మేల్మిగా
మీ మేర దప్పక పాలు మాలక లేచి దేవుని
పాదములు పూజింప గ్రక్కున ॥మేలుకొనరే॥
1.
దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండు
ధరుంపనయ్యెను మ్రొక్కులకు
ప్రతిఫలము నిచ్చెడు మూలకర్తకు గొలువ
సేయగ ॥మేలుకొనరే॥
2.
పక్షు లెల్లను గిలకించును ప్రభుని
మహిమలు బల దొడ్డగెను రక్షకుని
సకలోపకృతులను రమ్యముగా నుతియించి
పాడగ ॥మేలుకొనరే॥
3.
నిదుర బోయిన వేళ మిమ్మొక్క నిమిషమైనను
బాసియుండక పదిలముగా రక్షించు దేవుని
ప్రస్తుతింప మహా ముదంబున ॥మేలుకొనరే॥
4.
మేటియైన హృదయాబ్జములలో మీ
కృతజ్ఞతా భూషణంబులు నాటుగా ధరియించుకొని
ఇటు నిర్మలాత్ముని బూజసేయగ ॥మేలుకొనరే॥
5.
తెల్లవారగ దెలియరే యిది తెలివిగల మానవ
సమాజము ఉల్లాసిల్లుచు నీతి భాస్కరు
డుదయమయ్యెను హృదయముల పై ॥మేలుకొనరే॥