#24సర్వము దేవుని సొత్తు (దావీదు కీర్తన 24)
Author: మల్లెల దావీదుComposer/Ragam: హరికాంభోజి (ఛాయ: సఖులారా సంఘం పంపబడి)Category: దైవారాధన — దైవస్తుతి
ప
భూమండలము దాని సంపూర్ణతయును లోకమును
భూమండల వాసులను బొల్పార యెహోవావే ॥భూ॥
1.
యెహోవా సముద్రము మీద భూమి పునాది వేసి
మహా జలముల మీద మన దేవుడది స్థిరపరచె ॥భూ॥
2.
యెహోవా పర్వతమునకు నెక్కంగ పాత్రుడెవ్వడు
మహాలయమునందు మరి నిలవ యోగ్యుడెవ్వడు ॥భూ॥
3.
అపవిత్ర మనసు లేక కపట ప్రమాణము లేక
సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గలిగినవాడే ॥భూ॥
4.
అలాటి వాడు ప్రభుని యాశీర్వచనము నొందు
భూలోకమున రక్షణ దేవుని నీతి మత్వము పొందు ॥భూ॥
5.
ప్రభు నాశ్రయించు నట్టి వారు యాకోబు దేవ
ప్రభు సన్నిధానము వెదకు ప్రజలెల్ల నట్టివారే ॥భూ॥
6.
ద్వారంబులారా ఇక మీ తల లెల్ల బైకెత్తవలెన్
రారాజు కొరకు తలుపులారా మిమ్ము నెత్తుకొనండి ॥భూ॥
7.
ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవ్వడు
బలశౌర్యములు యెహోవా బహు శూరుడు యెహోవా ॥భూ॥