FaithWalk
← Back to Library

#23దేవుని స్తుతి

Author: మాముడూరి సైమన్Composer/Ragam: ముఖారి (ఛాయ: ఓ మా తండ్రి నీదు నామము)Category: దైవారాధన — దైవస్తుతి
ప
ఎటుల నీకు స్తుతులు ఒనరింతుము యెహోవా తనయా ఎటుల నీకు నుతులు ఒనరింతుము పటుతర పాపంబుల నెడి పంకమందు జిక్కి మదిన కిటము పడెడి మమ్ము బ్రోచి దిక్కు చూపినట్టి యేసు ॥ఎటుల॥
1.
పాపకూపమందు నుండగా బాపవిమోచనా దాపు జేర్చి కాపు జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తి జేయ నీ పవిత్ర రక్తమే నా ప్రాపుగా నొసంగితివి ॥ఎటుల॥
2.
భారభరితమైన యాత్మల భారమును దీసి భూరి సౌఖ్యములతో నింపను భారకుండ ఘోరమైన శ్రమల నొంది మరణ మొంది తిరిగి లేచి నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవ ॥ఎటుల॥
3.
నీతిహీనులమై యుండగా నో కర్తవు మాదు బీతలన్ని బాపి నీ కృపన్ నీతి రక్షణ వస్త్రములను భీతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను ఖ్యాతిగ సేవింప జేసితివి ॥ఎటుల॥
4.
నిన్ను జేరి నిశ్చలుండనై యీ భూమియందు నిన్ను బోలి నడుచుకొనుటకై తిన్నని మార్గమును జూపి అన్ని కీడులను జయించి పన్నుగా విమలాత్మ శక్తి నున్నతముగా నిచ్చిన యేసు ॥ఎటుల॥
5.
పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండ కరుణతోడ నెంచుకొంటివి తిరిగి వచ్చి మమ్ము మీ చిరప్రకాశ పురమునందు త్వరగ జేర్చి యందు సుఖము స్థిరముగా నొసంగు దేవ ॥ఎటుల॥