#52సాయంతన ప్రార్థన
Author: ఎ. చార్లెస్ కిన్సింగర్Category: సాయంతనారాధన
1.
ఆకాశంబు భూమియు – అంతట చీకటి ఆయెను
ప్రాకెడు చీకటి సమయమున – ప్రార్థన చేతుము మా దేవా ||
2.
చక్కని చుక్కలు మింటను – చక్కగా మమ్మును చూడుచుండగా
ప్రక్కకు రావే వేగముగా – ప్రభువా కావుము కావుము నీ నీడన్ ||
3.
చిన్న చిన్న పక్షులు – చిన్న చిన్న పూవులు
ఎన్నో ఎన్నో జీవులు – నిన్నే కొలిచి నిద్రించున్ ||
4.
చిన్ని చిన్ని పాపలు – చిన్ని చిన్న పడకలలో
చిన్ని కన్నులు మూయంగా – చెన్నుగ యేసు కావుమా ||
5.
నేలను బోయెడి బండ్లలో – నీటను బోయెడి ఓడలలో
గాలి విమానంబులలోన – కావుము దేవ ప్రయాణికులను ||
6.
రాత్రిలో నీదు దూతలు – రమ్యంబైన రెక్కలతో
చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ – నిద్రించెదము మా దేవా ||
7.
తెల్లవారు జామున – తెలివొంది మేము అందరము
మెల్లగ లేచి నుతింపన్ – మేల్కొలుపుము నా ప్రియ తండ్రి ||
8.
జనక తనయ శుద్ధాత్మ – జయము మహిమ స్తోత్రములు
అనిశము నీకే చెల్లునుగా – అనిశము చెల్లును నీకామేన్ ||