#186సిలువపై క్రీస్తుని ప్రేమ
Author: యర్రంశెట్టి దావీదుComposer/Ragam: నాదనాయకప్రియCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఏ పాప మెరుగని – యే పావన మూర్తి – పాప విమోచకుండ
నా పాలి దైవమా – నా పాపముల కొర – కై పాట్లు నొందినావా ||ఏ పాప||
1.
ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జలాటమున మొత్తిరా
ముళ్ళపోటుకు శిరము – తల్లడిల్లగ సొమ్మ – సిల్లిపోతివి రక్షకా ||ఏ పాప||
2.
కలవరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొక్కని – దోడుగా నిచ్చినారా ||ఏ పాప||
3.
చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడిచినావా
కడకు కలవరి గిరి – కడ కేగి సిలువను – గ్రక్కున దించినారా ||ఏ పాప||
4.
ఆ కాల కర్మములు – భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే నూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||
5.
పలువిధంబుల శ్రమలు – చెలరేగ తండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై బలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహమాయెనా ||ఏ పాప||
6.
బలిష్ఠుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – లీలపడ బొడిచినాడా
ఉల్లాసముగనట్లు – నల్ల నీరు బుంగగా – జలారెను గదా కోపము ||ఏ పాప||
7.
కటకటా పాప సం – కటము బాపుట కింత – పటుబాధ నొందినావా
ఎటువంటిది నీ ప్రేమ – యెటువంటిది శాంత – మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||