#123జెకర్యా పాట
Author: మల్లె దావీదుComposer/Ragam: బేగడCategory: సాయంతనారాధన
ప
ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక – యాశ్రితుడౌ తన జనులకు దర్శన మాత్మ విమోచన గలిగించె ||ఇశ్రాయే||
1.
తన దాసుడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె – మన శత్రువులగు ద్వేషుల నుండియు మనలను బాపి రక్షణ నిచ్చె ||ఇశ్రాయే||
2.
దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి – మానవ మన పితరుల గరుణింపగ మహిలోన నిబంధన జేసె ||ఇశ్రాయే||
3.
జనకుండగు నబ్రాహాముతో జేసిన యా ప్రమాణము దల్చి – మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయులమై మెలగ ||ఇశ్రాయే||
4.
ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండ – పాయక తన సేవను నిత్యంబును చేయగ నీ రక్షణ నిచ్చె ||ఇశ్రాయే||
5.
ధరనో శిశువా దేవుని దీర్ఘ దర్శనమనెడు పేరొందెదవు – పరమేశ్వరుని వాత్సల్యతతో పాప విముక్తి ప్రజలొంద ||ఇశ్రాయే||
6.
మానుగ రక్షణ జ్ఞానమొసంగగ మార్గము సిద్ధపరచుటకై – దీన మనస్సుతో ప్రభునకు ముందుగా నడిచెదవు భయభక్తి ||ఇశ్రాయే||
7.
మరియును సమాధాన సరణిలో మన మింక నడువ చీకటిలో – మరణ చాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె ||ఇశ్రాయే||
8.
జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కలుగును గాక – మునుపు నిపుడు నెప్పుడు తనరినట్లు యుగములకును దనరారును గాక ఆమేన్ ||ఇశ్రాయే||