#181క్రీస్తు శ్రమల ధ్యానము
Author: ఎస్. జేమ్స్Composer/Ragam: కాంభోజిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
రాజులకు రాజైన యీ – మన విభుని – పూజసేయుటకు రండి
ఈ జయశాలి కన్న – మన కింక – రాజేశ్వరులు లేరని ||రాజులకు||
1.
కరుణగల సోదరుండై – యీయన – ధరణి కేతెంచెనయ్యా
స్థిరముగా నమ్ముకొనిన – మన కొసంగు – వరలోక రాజ్యంబును ||రాజులకు||
2.
నక్కలకు బొరియలుండె – నాకాశ – పక్షులకు గూళ్ళుండెను
ఒక్కింత స్థలమైనను – మన విభుని – కెక్కడ లేకుండెను ||రాజులకు||
3.
అపహాస్యములు చేయుచు – నాయన – యాననము పైన ఉమియుచు
కృప మాలిన సైనికు – లందరును – నెపము లెంచుచు గొట్టిరి ||రాజులకు||
4.
కరమునందు ఒక రెల్లు – పుడకను – స్థిరముగా నుంచి వారల్
ధరణిపతి శ్రేష్ఠుడా – నీకిప్పుడు – దండ మనుచును మ్రొక్కిరి ||రాజులకు||
5.
ఇట్టి శ్రమలను బొందిన – రక్షకుని – బట్టుదలతో నమ్మిన
అట్టహాసముతోడను – వరలోక – పట్టణంబున జేర్చును ||రాజులకు||
6.
శక్తిగల రక్షకుండై – మన కొరకు – ముక్తి సిద్ధము జేసెను
భక్తితోడ బ్రార్థించిన – మన కొసగు – రక్తితో నా ముక్తిని ||రాజులకు||
7.
త్వరపడి రండి రండి – యీ పరమ – గురుని యొద్దకు మీరు
దరిని జేరిన వారిని – యీ ప్రభువు – దరుమ డెన్నడు దూరము ||రాజులకు||