FaithWalk
← Back to Library

#142యేసు నామస్మరణ

Author: వంతుగాని పరదేశిComposer/Ragam: హిందుస్తానీ కాపి (ఛాయ: ఆహా మహాత్మ! హా శరణ్య)Category: క్రీస్తు నామములు — బిరుదులు
ప
శ్రీ యేసు దివ్య నామస్మరణ – చేయవే మనసా పాయక స్మరియించి పరము – పొందవే మనసా ||శ్రీ||
1.
నరుల పాప హరణమునకై – నరుడయ్యె మనసా పరమ పుర ద్వారంబు మనకు – తెరచెనే మనసా ||శ్రీ||
2.
నరుల పాప శాప ఫలము – నరకమే మనసా మరణమును తొలంచ ప్రభువే – నుడివెనే మనసా ||శ్రీ||
3.
పాపమునకు ప్రాయశ్చిత్తం – భవ్యమే గదా ప్రభువే ప్రాయశ్చిత్త బలియై – పరగెనే మనసా ||శ్రీ||
4.
సిలువవేసి ప్రభుని ప్రజలు – చంపరే మనసా బలుడు తిరిగి లేచే మృతిని – గెలిచెనే మనసా ||శ్రీ||
5.
గెలిచి యేసు హితుల మధ్య – నిలిచెనే మనసా నిలిచి సమాధాన ముంచు – పలికెనే మనసా ||శ్రీ||
6.
పునరుత్థాన మేసు దేవ – పుత్రుడని మహా ఘనముగా ప్రకటించుచుండ – కాననే మనసా ||శ్రీ||
7.
తానే మార్గం తానే సత్యం – తానే జీవము ఈ పునః సత్యంబు నమ్ము నరులు – ధన్యులే మనసా ||శ్రీ||
8.
నిన్ను నీ వెరిగి ప్రభుని – నెరుగవే మనసా సన్నుతుడందుల కొసంగె – సత్య వేదము ||శ్రీ||
9.
పాపములకు పరితపించి – ప్రభుని జేరవే దాపునకు రమ్మంచు కరము – చాపెనే మనసా ||శ్రీ||
10.
ఎంత ఘోర పాపమైన – నెంచడే మనసా ఎంత మెత్తనైనను క్షమి – యించునే మనసా ||శ్రీ||
11.
బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు మనసా ఈ బ్రతుకునందె ప్రభుని పదము – పట్టుకో మనసా ||శ్రీ||
12.
జనక కుమారాత్మ దేవున్ – జపియించు మనసా అనయమును స్మరించు స్వర్గ – మదియె మనసా ||శ్రీ||